తిరుపతి : పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు (Padmavati Brahmotsavam) నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు తదితర ప్రాంతాలను పరిశీలించారు.
జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలాఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్(Vehicle Parking) కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు.
భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, గోశాల(పూడి రోడ్డు) వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. తమిళనాడు(Tamilnadu) భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు.
టీటీడీ సీవీఎస్వో శ్రీధర్ మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. క్యూలైన్లు, పుష్కరిణి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.