Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల మూడోరోజు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని ఈవో లవన్న తెలిపారు. ఆలయ ధర్మకర్తలమండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణం, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంకాలార్చనలు, హోమం తర్వాత స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై వేంచేబు చేసి అక్క మహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు.
మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో ఆలయోత్సవంతోపాటు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. ఉత్సవమూర్తులు గంగాధర మండపం నుండి నంది మండపం.. బయలువీరభధ్ర స్వామి వరకు జరిగిన ఊరేగింపు ఆద్యంతం కన్నులపండువగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు,శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
అఖండమైన ఙ్ఞానానికి ప్రతీక హంస వాహనంపై సకల కళలకు అధిపతి పరమేశ్వరుడు ఙ్ఞాన శక్తి అయిన అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవం అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామి అమ్మవార్లకు ఆస్థాన సేవ జరిగింది. గ్రామోత్సవంలో చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్, ఈఈ రామకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీందర్ ప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్‌కుమార్, రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయ్యన్న, సూపరింటెండెంట్ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల భక్తులు, శివస్వాములు వేలాది మందిగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుండి స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండి అలంకార దర్శనాలు చేసుకుంటున్నారు. ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ ఇరుముడి సమర్పణలు చేయిస్తున్నారు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను దుర్వినియోగ పరచకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకేనేలా ఉంచాలని ఈవో లవన్న భక్తులను కోరారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం విజయవాడ నుండి చైర్మెన్ కే రాంబాబు, ఈవో డీ భ్రమరాంబ, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక వేదపండితులు, ఆలయ ప్రధాన గోపురం వద్దే శ్రీశైల దేవస్థానం చైర్మెన్ చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక వేదపండితులు పట్టు వస్త్రాలను తలపై ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. అటుపై స్వామి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు. అంతకుముందు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజులు నిర్వహిస్తారు. ఉదయం కాణిపాక వరసిద్ది వినాయక స్వామి, సాయంత్రం టీటీడీ అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.