విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం పెంచిన హెచ్ఆర్ఏ ప్రకారం విజయవాడలోగానీ, గుంటూరులోగానీ ఇండ్లు అద్దెకు దొరుకుతాయా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హెచ్ఆర్ఏను 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన హెచ్ఆర్ఏ ఉత్తర్వుల్లో కొత్తదనం ఏమీ లేదని బొప్పరాజు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రభుత్వం హెచ్ఆర్ఏ శ్లాబులో తగ్గించిన దాంట్లో భాగంగా ఇచ్చినదే ఈ ఉత్తర్వులని చెప్పారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో అన్నీ లొసుగులే ఉన్నాయని చెప్పారు.
30 శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏను.. ఏ ప్రాతిపదికన 16 శాతంగా ఇస్తున్నారని బొప్పరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ జీవోకు శాస్త్రీయత లేదని చెప్పారు. 11వ పీఆర్సీలో 30శాతం తగ్గకుండా ఇవ్వాల్సి ఉండగా.. దాన్ని తుంగలో తొక్కి అధికారుల కమిటీ ఈ ఉత్తర్వులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వం చెప్పాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని, ఇప్పుడేమో ఫిబ్రవరి 1 నే జీతాలు వేస్తామంటూ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతున్నదో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.