శ్రీశైలం : ఆషాఢ మాసం మూలానక్షత్రం సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఉదయం అమ్మవారి ఆలయం నుంచి ఈవో ఎం శ్రీనివాసరావు, మల్లన్న ఆలయ ప్రధానార్చకులు హెచ్ వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఎం ఉమానాగేశ్వరశాస్త్రి, ఆలయ ఏఈఓ ఎం హరిదాసు పలువురు అర్చకస్వాములు, వేదపండితులు సంప్రదాయబద్దంగా పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలపుష్పాలతో ఊరేగింపుగా అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు చేసి, బోనం సమర్పించారు. కార్యక్రమానికి ముందుగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించాలని అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరుగకుండా చూడాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు చేకూరాలని సంకల్పం పటించారు. అనంతరం అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పించి.. మొక్కులు చెల్లించారు.