తిరుపతి: తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం (Bomb Threat) సృష్టించాయి. స్టార్ హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, కపిలతీర్థం, అలిపిరి సమీపంలోని హోటళ్లకు మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. నగదు ఇవ్వాలని, లేదంటే చంపుతామని, మీ హోటళ్లలో పలుచోట్ల బాంబులు పెట్టామని హెచ్చరించినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. హోటల్స్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. బాంబు బూచీ సమాచారంతో నగర వాసులు ఉలిక్కి పడ్డారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ ఎవరుచేశారు, ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఆరాతీస్తున్నారు.
తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్5-154 విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆదమ్‌లాన్‌జా 333 పేరుతో ఉన్న ఎక్స్ (X) ఖాతా నుంచి బెదిరింపు మెసేజ్ పంపినట్లు చెప్పారు. వెంటనే అప్రమత్తమై ఎయిర్‌పోర్టుకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.