టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్షపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పవన్‌ను స్వామి అని విమర్శించిన భూమన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని స్వాగతిస్తున్నామని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని తెలిపారు. సనాతన ధర్మంపై మాట్లాడే నైతిక హక్కు భూమనకు లేదని అన్నారు. పవన్‌ను స్వామి అని విమర్శించిన భూమన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీలో భూమన చేసిన అక్రమాలను తొందరలోనే బయటపెడతామని తెలిపారు. సనాతన ధర్మంపై అంత నమ్మకం ఉంటే మీ పార్టీ అధినేత జగన్‌తో దీక్ష చేయించగలరా అని సవాలు విసిరారు.
తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. హైందవ సంస్కృతిని పవన్ కల్యాణ్ కించపరుస్తున్నారని విమర్శించారు. అసలు సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్‌కు ఓనమాలు అయినా తెలుసా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒక క్షుద్ర రాజకీయ నాయకుడు అని.. మతం ముసుగులో నాటకం ఆడాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్‌ను చూస్తుంటే కెవ్వుకేక పాట గుర్తొచ్చిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవననానంద స్వాముల వారు తిరుపతికి వేంచేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాలు మాట్లాడనంటూనే.. తన మీద, వైఎస్ జగన్ మీద ఇష్టానుసారంగా రాజకీయ ప్రేలాపనలు చేశారని మండిపడ్డారు. కోర్టులను కూడా హెచ్చరిస్తున్నట్లుగా పవన్ మాట్లాడిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్లుగా పవన్ కల్యాణ్ కలరింగ్ ఇచ్చారని భూమన అన్నారు. హైందవ సంస్కృతిని పవన్ కల్యాణ్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. పీఠాధిపతులంతా తమ జీవితాలను త్యాగం చేశారు.. కానీ ఈ పీఠాలకు ఏ విలువ లేదన్నట్లుగా పవన్ మాట్లాడారని అన్నారు. ఆయన మాటలు విని వారంతా భయపడిపోతారని చెప్పారు. పవన్ భాష మతి చలింపేజేసేలా ఉందని.. ఇప్పటివరకు ఎవరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించలేదని పవన్ మాట్లాడారని మండిపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే దాన్ని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయడమే తమకు అభ్యంతరమని పేర్కొన్నారు.
14 ఏండ్లుగా తన కుమార్తెలను దైవ దర్శనానికి తీసుకురాని వ్యక్తి.. ఇప్పుడు సనాతన ధర్మ ఆచార్యులు అయ్యారని భూమన విమర్శించారు. సనాతన ధర్మంలో పిల్లలకు 9 నెలలకే తలనీలాలు తీయడం ఆనవాయితీ.. కానీ ఎప్పుడూ అలా చేయని పవనానంద స్వామి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షుడు అయ్యాడని విమర్శించారు.