Madhavilatha | బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), తెలుగు ఫిలిం ఛాంబర్‌కు మాధవీలత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జేసీ మాటలతో తాను, తన కుటుంబం ఎంతగానో ఇబ్బంది పడిందని ఈ సందర్భంగా మాధవీలత అన్నారు. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా అని నిలదీశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ పార్క్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. అయితే ఆ వేడుకలకు వెళ్లవద్దని.. అక్కడ మహిళలకు రక్షణ ఉండదని మాధవీలత ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మాధవీలత ఒక సినిమా యాక్టర్ అని.. యాక్టర్స్ అంతా ప్రాస్టిట్యూట్స్‌నే అని పరుష పదజాలంతో విమర్శించారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తన వయసు 72 సంవత్సరాలు అని.. ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని వివరించారు. ఎవరి బతుకుదెరువు వారిదేనని అన్నారు. మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. మాధవీలతను క్షమాపణలు కోరారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. కానీ మాధవీలత మాత్రం జేసీని క్షమించలేదు. ఆ విషయాన్ని ఎంతలా మరిచిపోదామన్న తన వల్ల కావడం లేదని అప్పట్లోనే ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ‘ చాలా ప్రయత్నం చేశా.. కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి.. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతిక్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం.. అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి.’ అని మాధవీలత అన్నారు. ఎన్నోసార్లు ఎందరో తన ఆత్మవిశ్వాసాన్ని చిదిమివేయాలని ప్రయత్నం చేశారని.. పదే పదే ఇవే మాటలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), ఫిలిం ఛాంబర్లో మాధవీలత ఫిర్యాదు చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు.