విజయవాడ: జగన్ సర్కార్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. బియ్యం కుంభకోణానికి సర్కార్‌లోని పెద్దలకు సంబంధమున్నదని ఆరోపించారు. మరోవైపు పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతున్నదని చెప్పారు.
పేద ప్రజానీకానికి పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం ఏపీలో పక్కదారి పడుతున్నదని సోము వీర్రాజు చెప్పారు. గత కొన్ని నెలలగా కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 1.40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారని, వీరిలో అత్యధిక శాతం మందికి అసలు రేషన్ బియ్యం అవసరమే లేదన్నారు. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా కొనసాగుతుందన్నదన్నారు. ఇతర దేశాలకు తరలించి వైసీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని సోము వీర్రాజు విచారం వ్యక్తం చేశారు. ఏపీలో పెద్దయెత్తున బియ్యం కుంభకోణం జరుగుతుందని, దీనిలో సర్కార్‌లోని పెద్దలకు భాగస్వామ్యం ఉన్నదని చెప్పారు. త్వరలో వీరందరి బాగోతాలను బయటపెడతామని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై మంత్రులు కౌంటర్ ఇవ్వడం ఈ అంశాన్ని వివాదం చేసే కుట్రగా అభివర్ణించారు. పోలవరంను ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే అన్నారు. విభజన బిల్లు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాల్సిన అవసరమున్నదని తెలిపారు. పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న జగన్ ప్రభుత్వం.. మూడేండ్లలో వాటిని ఎందుకు బయటపెట్టి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.