Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చే శారు. ఈ మేరకు తిరుపతి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
పోలీసుల నోటీసులపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కొద్దిరోజుల పాటు తాను బిజీగా ఉంటానని.. వెంటనే విచారణకు హాజరుకాలేనని వివరించారు. అయితే వీలు చూసుకుని రావాలని భూమనకు ఎస్సై అజిత సూచించారు. వచ్చే మంగలవారం అంటే.. సెప్టెంబర్ 23వ తేదీన తాను విచారణకు హాజరవుతానని పోలీసులకు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసిందని పేర్కొన్నారు. మలమూత్రాలు, మద్యం బాటిళ్ల సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ ధర్మాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. హిందూ దేవుళ్ల విగ్రహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్, పాలకమండలి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
భూమన చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. అది తప్పుడు ప్రచారమని మండిపడింది. సోషల్మీడియాలో ప్రచారం అవుతున్న ఈ విషయంపై ఆరా తీస్తే.. అది మహావిష్ణువు విగ్రహం కాదని, అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరుడి విగ్రహమని తేలిందని ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. తయారీలో లోపం కారణంగా గతంలో ఇక్కడ శిల్పాలు చెక్కిన పట్టు కన్నయ్య అనే శిల్పి దాన్ని ఇక్కడ పడేశారని వివరించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గత పదేళ్లుగా ఆ విగ్రహం అక్కడే పడి ఉందని పేర్కొంది. కాబట్టి ఎవరూ ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, షేర్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలోనే భూమనపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.