Bhumana Karunakar Reddy | టీటీడీలోని పరకామణిలో అక్రమాల ఆరోపణలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో పరకామణిలో అవకతవకలు జరిగాయని మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. జ్ఞాన శూన్య మూర్ఖేశ్ లోకేశ్ అని, భక్తి లేని రసరాయుడు బీఆర్ నాయుడు అని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కేసును సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని సవాలు విసిరారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పరకామణిలో అక్రమాలు జరిగినట్లు రుజువైతే అలిపిరి వద్ద తల నరక్కుంటానని వ్యాఖ్యానించారు.
తిరుమలను ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ అడ్డాగా మార్చిందని భూమన విమర్శించారు. 2023లో రవి కుమార్ అనే ఉద్యోగి పరకామణిలో 800డాలర్లు చోరీ చేస్తూ దొరికాడని.. 20 ఏండ్లుగా అతను పరకామణిలో దొంగతనం చేస్తున్నట్లు గుర్తించి వైసీపీ ప్రభుత్వం పట్టుకుందని తెలిపారు. రవికుమార్‌ను పట్టుకున్న తర్వాత వారి కుటుంబసభ్యులు అందరూ పాప పరిహారంగా తమకు ఉన్న వంద కోట్లకు పైగా ఆస్తులను టీటీడీకి కానుకగా ఇచ్చారని వెల్లడించారు. ఆ ఆస్తులను టీటీడీ బోర్డులో తీర్మానం చేశారని కూడా చెప్పుకొచ్చారు.
రవికుమార్ అనే దొంగను చంద్రబాబు ప్రభుత్వం పట్టుకుందా? అని భూమన ప్రశ్నించారు. ఎవరైనా కొట్టేయాలని అనుకునేవారు దొంగను పట్టుకుంటారా అని నిలదీశారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను చైర్మన్ కాదని.. విజిలెన్స్ వాళ్లను బెదిరించి, ఆ సీసీటీవీ వీడియోలను బయటపెట్టారని తెలిపారు. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగతనంపైనా వీడియోలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే గతంలో విచారణ జరిపిన విజిలెన్స్ నివేదికను ఇప్పుడు బయటపెట్టాలన్నారు. రవికుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయని తెలిపారు. మా బినామీలకు ఆస్తులు రాసిచ్చి ఉంటే.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.