హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు దుమారం రేపుతున్నది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ (ఎన్డీడీబీజీ) సీఏఎల్ఎఫ్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఈ ఏడాది జూలైలో లడ్డూను ల్యాబ్‌కు పంపగా, అదే నెల 17న నివేదిక వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. లడ్డూలో ఆవు నెయ్యి, సో యాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మకజొన్న, పత్తి గింజలతోపాటు చేపనూనె, జం తుకొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఆ రిపోర్టును గురువారం టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు.
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని స్వయంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని సెంటిమెంట్‌గా భావించే భక్తులకు తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. సీఎం వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల పవిత్రతను, వందల కోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపం చేశారని విమర్శించారు. తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణాని కి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?’ అంటూ సవాల్ విసిరారు.
చంద్రబాబు కామెంట్స్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రత, ప్రతిష్ఠకు భగం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని, ఆ మహాపాపానికి, అపచారానికి కారకులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిని టీటీడీ మారెటింగ్ విభాగం కొనుగోలు చేస్తుంది. ప్రతి ఆరు నెలలకొకసారి టెండర్లు పిలిచి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నిత్యం 300-500 లీటర్ల నెయ్యి వినియోగిస్తారు. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉన్నది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నె య్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నది. 2021 మార్చి వరకు నందిని బ్రాండ్ (కర్ణాటక) నెయ్యి సరఫరా అయ్యేది. తకువ ధరకి సరఫరా చేయలేమంటూ నందిని తప్పుకున్నది. ఆ తర్వాత యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్-1గా, ఎల్-2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందాయి. కేజీ నెయ్యి రూ.424 ప్రకారం టీటీడీకి సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడిని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవారిని భగవంతుడు క్షమించబోడని గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పారని, ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరు మీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడని, అయినా చంద్రబాబు మారలేదని మండిపడ్డారు.