తిరుమల : తిరుమలలో(Tirumala) తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైప్‌లైన్ ద్వారా బయోగ్యాస్ (Biogas) అందించేందుకు ఉద్దేశించిన బయోగ్యాస్ ప్లాంటుకు బుధవారం భూమి పూజను నిర్వహించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్లాంట్‌కు టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి భూమిపూజ చేశారు.
ఈ ప్లాంటు నిర్మాణాన్ని రూ.12.85 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించగా రూ.7.05 కోట్లు ఐఓసీఎల్, రూ.5.80 కోట్ల నిధులను టీటీడీ(TTD) సమకూర్చనుంది. 2.22 ఎకరాల్లో బయో గ్యాస్ ప్లాంటును, 0.17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు. రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే మిశ్రమ వ్యర్థాల ద్వారా బయో గ్యాస్ ను ఉత్పత్తి చేసి రెండున్నర కిలో మీటర్ల దూరంలోని తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైపు లైన్ ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఐఓసీఎల్ ఈడీ, ఎస్ హెచ్ బి.అనిల్ కుమార్, సీజీఎంలు వై.వి.రమణరావు, ఏం.ఆర్.వి. బద్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.