అమరావతి : చిత్తూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరొకరు ఇవాళ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య పదికి చేరింది. ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి అనే పట్టు చీరల వ్యాపారి తన కొడుకు నిశ్చితార్థం కోసం చిత్తూరు జిల్లాకు ప్రైవేట్ బస్సులో బయలు దేరారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడడంతో సంఘటన స్థలంలో 8 మంది చనిపోగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. ఈ సంఘటనలో మరో 40 మందికి పైగా గాయాలు అయ్యాయి.
కాగా బస్సు ప్రమాద స్థలాన్ని రోడ్డు, భద్రత అదనపు డీజీ కృపానంద త్రిపాటి సందర్శించి బస్సును పరిశీలించారు. ఒకే ప్రాంతంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఆర్ అండ్ బీ శాఖాధికారులు స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరుగకుండా చేపట్ట వలసిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. జాతీయ రహదారులపై ఉన్న హోటళ్లను, దాబాలను తనిఖీలు చేయాలని వారు మద్యం అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.