AP Politics | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, మార్చి 28, (నమస్తే తెలంగాణ): ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టది మరోదారి అన్నట్టుంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విచిత్రమైన రాజకీయ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. పాలకపక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటకాగుతున్నాయి. ఇక జనసేన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది మొదటి నుంచి బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నది. ఇక్కడ ఏ రాజకీయపార్టీ ఎవరితో ఉందన్నది కాదు ప్రశ్న. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడేది, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించగలిగేది ఎవరనేది ప్రజలకు అర్థం కావటం లేదు. ఈ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీతో దోస్తీ కొనసాగించటానికి, కొత్తగా దోస్తీ కట్టడానికి పోటీపడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడేది ఎవరనేది దిక్కుతోచక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా?
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలను నెరవేర్చకపోయినా, రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విశాఖ స్టీల్‌ను ప్రైవేట్‌పరం చేస్తామన్నా, గన్నవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీ కంపెనీకి ధారాదత్తం చేస్తున్నా పాలకపక్షం వ్యతిరేకించదు, ప్రతిపక్షం ప్రశ్నించదు. ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను బలిచేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పాలక, ప్రతిపక్ష పార్టీల వైఖరి పట్ల ప్రజలలో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి.
దేశం అట్డుడికినా స్పందించరా?
రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటే కాదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పార్లమెంట్లో అడుగుపెట్టకుండా అనర్హుడిని చేయడం పట్ల దేశం యావత్తూ అట్డుడికిపోయింది. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఈ అంశంపై స్పందించి కేంద్రం చర్యను తీవ్రంగా ఖండించినా, ఆంధ్రప్రదేశ్ పార్టీలకు ఉలుకు, పలుకు లేదు. కాంగ్రెస్, బీజేపీకి సమదూరం పాటించే పార్టీలు, కాంగ్రెస్‌తో విభేదించే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది, బీఆర్ఎస్, ఆప్ వంటి పార్టీలు సైతం స్పందించి కేంద్రం చర్యను తీవ్రంగా ఖండించాయి. కానీ వైసీపీ, టీడీపీ మాత్రం పట్టించుకోలేదు. ఈ రెండు పార్టీలు ధరల పెరుగుదలపైనా, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటినా, వంటగ్యాస్ సిలిండర్ల ధర మూడింతలు పెరిగినా తమకు సంబంధం లేని విషయంగా స్పందించలేదు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవటం, విపక్ష పార్టీల అణచివేత, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోయటం, ప్రజాధనాన్ని గుజరాత్ కంపెనీలకు దోచిపెట్టటం, అన్ని ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించుకువెళ్లటం, బీజేపీ పాలిత రాష్ర్టాలకే నిధులు, ప్రాజెక్టులు కట్టబెట్టటం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వాలను పడగొట్టటానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చటానికి అస్త్రంగా ఉపయోగించుకోవటాన్ని కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించే పార్టీలు సైతం తప్పు పట్టిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాలక, ప్రతిపక్ష పార్టీలు స్పందించిన దాఖలా లేదు.
విద్యుత్తు మీటర్లకు ఒప్పుకోవటమేనా?
వ్యవసాయ విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో కేంద్రం చెప్పినట్టు వినకపోవటం వల్ల తెలంగాణకు రూ.25 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిసినా, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ తెగేసి చెప్పారు. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టటానికి అంగీకరించింది.
దేశ ప్రయోజనాలు గాలికేనా?
మోదీ-అదానీ మధ్య సంబంధాలు, అదానీ సంస్థలు ప్రజాధనాన్ని కొల్లగొట్టటం పట్ల పార్లమెంట్ దద్దరిల్లినా, విపక్ష పార్టీలన్నీ ఏకమై కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీలో ప్రతిరోజు ఏదో ఒకరూపంలో నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ఎక్కడా కూడా ఆంధ్ర పార్టీలు కనిపించవు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై 17 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇందులో కూడా వైసీపీ, టీడీపీలు లేవు. కనీసం ఈడీ చట్టానికి సవరణలు చేసి ప్రతిపక్ష పార్టీలను వేధించటానికి అనుగుణంగా మార్చుకోవటాన్ని నిరసిస్తూ ఢిల్లీలో విపక్ష పార్టీలన్నీ మానవహారం నిర్వహిస్తే, ఇదేదో తమకు సంబంధం లేని విషయంగా వైసీపీ, టీడీపీలు వ్యవహరించాయి.
బీజేపీతో చుట్టరికం దేనికి?
వైసీపీ, టీడీపీలు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో స్నేహం చేయటంలో ఆంతర్యం ఏమిటి? పోనీ ఆంధ్రలో బీజేపీ ఏమైనా బలంగా ఉన్నదా? ఆ పార్టీకి ఎక్కడైనా క్యాడర్ ఉన్నదా? ఎందుకోసం? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కేంద్రంతో మైత్రి చేయడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ప్రధాని మోదీ, అమిత్ షా దయాదాక్షిణ్యాల కోసం పాలక, ప్రతిపక్షం దేబరించాల్సిన అవసరం ఎమున్నది? వారి కనుసన్నల్లో మెలగడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ఒరిగిన ప్రయోజనం ఏమైనా ఉన్నదా? మరి ఆంధ్రపార్టీలకు ఎందుకీ దౌర్భాగ్య పరిస్థితి అని ప్రజలు ఈసడించుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి సొంత ప్రయోజనాల కోసం నోళ్లు మూసుకున్న ఆంధ్ర పార్టీల సిగ్గులేనితనాన్ని నిగ్గదీసి అడగటానికి ప్రజలు సన్నద్ధం అవుతున్నారు.
ఢిల్లీ బాద్షాల చేతిలో బంధీ
ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రధాన ప్రతిపక్షం ఢిల్లీ బాద్షాల చేతిలో బంధీ అయ్యాయి. ఫలితంగా 13 కోట్ల తెలుగు ప్రజలకు ఢిల్లీ నడిబొడ్డున అవమానం జరుగుతున్నది. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్టు అతీగతి లేకుండా పోయినా, విశాఖ రైల్వే జోన్ హామీ బుట్టదాఖలైనా చివరకు విశాఖ స్టీల్, గన్నవరం, కృష్ణపట్నం పోర్టులను బీజేపీ బాద్షాలు తరలించుకుపోతున్నా ఆంధ్రలో పాలకులకు పట్టదు, ప్రతిపక్షం పట్టించుకోదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించినా, ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించినా ఆంధ్రలో పాలక, ప్రతిపక్షం మాత్రం స్పందించలేదు. రాహుల్ గాంధీ పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్‌తో రాజకీయంగా విభేదాలున్నా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఆంధ్రలో పాలక, ప్రతిపక్షాలు స్పందించకపోవటం విచారకరం. ఢిల్లీ బీజేపీ బాద్షాలు తెలుగుజాతికి చేస్తున్న అన్యాయం పట్ల తెలుగు ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
– చలసాని శ్రీనివాస్, అధ్యక్షుడు, ఆంధ్రా మేధావుల సంఘం
రాష్ర్టాన్ని తాకట్టు పెట్టారు
ఆంధ్రలో ఏ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించే స్థితిలో లేదు. వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఎనిమిదేండ్లలో ఈడీ ఒక్కసారి కూడా జగన్‌ను విచారణకు పిలిచిన దాఖలాలు లేవు. కేంద్రాన్ని ప్రశ్నించటానికి జగన్‌కేమో కేసుల భయం. టీడీపీకేమో జగన్ పక్కన బీజేపీ ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని భయం. జనసేనకు ఆంధ్ర బీజేపీ అంటే చచ్చేంత భయం. కానీ కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆంధ్రలో పాలక, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ముందు సాగిలబడి రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టటం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది.
– భోగాది వెంకటరాయుడు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు
అసలే వ్యాపారస్తులు…పైగా కేసుల భయం
ఏపీలో రాజకీయ నాయకులు పాలక, ప్రతిపక్షంలో ఉన్న వారంతా మొదట వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు. వీరు ఇప్పటికే వివిధ కేసుల్లో ఇరుక్కున్నారు. అందుకే కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం చేయరు. పాలకపక్ష నాయకులు, ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా ఈ కేసుల భయానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారు. వీరికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, ప్రజల ప్రయోజనాలు అంతకంటే పట్టవు, వీరి వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఆంధ్ర ప్రజానీకానికి ఎప్పుడూ లేదు.
– జీవీ హర్షకుమార్, మాజీ ఎంపీ