తిరుమల : టీటీడీ (TTD) నూతన పాలక మండలి తొలి సమావేశం కీలక నిర్ణయాలు ( Key decision) తీసుకుంది. కొత్త పాలకమండలి ప్రమాణం తరువాత సోమవారం టీటీడీ భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు (Chairman BR Naidu ) అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధించినట్లు స్పష్టం తెలిపారు.
టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను (Non-religious employees ) ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) పేరు రద్దు చేసి , టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసందానం చేయాలని నిర్ణయించిందన్నారు. తిరుమలలో విశాఖ శారధాపీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
సామాన్య భక్తులకు 2,3 గంటల్లో సర్వదర్శనం
సామాన్య భక్తులకు 2,3 గంటల్లో సర్వదర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నామని వివరించారు. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేసి, పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ నగదు ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేసినట్లు నాయుడు వివరించారు.
తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తిరుపతిలో నిర్మించిన ఫ్లై ఓవర్‌కు గరుడ వారధి పేరును పునరుద్దరించింది. తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.