తిరుమల : ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 11వ విడత బాలకాండ అఖండ పారాయణం భక్త జనరంజకంగా సాగింది. బాలకాండలోని 50 నుంచి 55 సర్గల వరకు గల 153 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయణంతో తిరుమల గిరులు మార్మోగాయి. నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కొనసాగింది. విశేష సంఖ్యలో భక్తులు హాజరై శ్రీనివాసుడి నామస్మరణం చేయడంతో తిరుమల పులకించిపోయింది.
బాలకాండ పారాయణం నిర్వహిస్తున్నఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజులు మాట్లాడుతూ.. మన పూర్వీకులు మనకు అందించిన మంత్రోచ్చారణ దివ్యశక్తిని కలిగిస్తుందని, దీనితో సమస్త రోగాలను నయం చేయవచ్చని తెలిపారు. అనాదికాలం నుంచి మానవులు రామాయణం విని, పారాయణం చేయడం వలన బాధలు తొలగి, సుఖ సంతోషాలతో ఉన్నట్లు పురాణాల ద్వారా నిరూపితమైనదన్నారు. వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించినట్లు, యావత్ ప్రపంచం రాముడి ఆశ్రయించి, రామనామం పలికితే సకల శుభాలు సిద్ధిస్తాయని వివరించారు.
అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన పండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.