Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో వైభవంగా జరిగే కార్తీక మాసోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులతో స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసు అధికారులు, ఇతర సిబ్బందికి ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజీ నాయక్ హితవు చెప్పారు. యాత్రికులకు దిశానిర్దేశం చేయాలని తెలిపారు. కార్తీక మాసాంతం క్షేత్ర పరిధిలో పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు వీలుగా షిఫ్టుల వారీగా అంకిత భావంతో విధులు నిర్వహించాలని చెప్పారు.
ప్రధానంగా సమస్యాత్మకమైన శివసదన్ గేటు వద్ద అధికంగా బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు రామాంజీ నాయక్ సూచించారు. అదే విధంగా పార్కింగ్ స్థలాలకు వెళ్లే మార్గాలు, లడ్డూ ప్రసాద విక్రయశాల, కళ్యాణకట్ట, పాతాళగంగ వద్ద ప్రత్యేక నిఘా ఉంచాల్సిందిగా చెప్పారు. దేవస్థానం అధికారులతో మమేకమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మాసోత్సవాలు పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కోరారు. మాసాంతం బందోబస్తు కోసం సుమారు 300 మంది పోలీసు అధికారులు సిబ్బంది ప్రత్యేక విధుల్లో హాజరవుతున్నారని ఆయన తెలిపారు.