Srisailam | ప్రఖ్యాతి గాంచిన శ్రీశైల మహా క్షేత్రానికి కార్తీక మాసంలో దేశం నలుమూలల నుండి వచ్చిన యాత్రికులకు సేవలందించడంలో పోలీసులు అంకిత భావంతో విధులు నిర్వహించారని ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ అన్నారు. కార్తీకమాసం ముగిసిన సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోంగార్డు నుండి డీఎస్పీ స్థాయి వరకు సుమారు 400 మంది అధికారులు, సిబ్బంది సమన్వయంతో రేయింబవళ్లు విధులు నిర్వహించినందుకు పేరుపేరున అభినందనలు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ నుండి వచ్చే రహదారుల వెంట ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉన్నతాధికారుల సూచనల మేరకు విజువల్ పోలీసింగ్ ప్రణాళికలతో మొబైల్ పెట్రోలింగ్ చేసి సత్ఫలితాలను సాధించడం హర్షనీయమని అన్నారు.
దేవస్థానం అధికారులు సహా సెక్యూరిటీ విభాగం సీసీ కంట్రోల్ ద్వారా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సున్నిత ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మాసోత్సవాలు ప్రశాంతంగా జరిపించగలిగినట్లు రామాంజీ నాయక్ తెలిపారు. అదే విధంగా స్వామి అమ్మ వార్లను దర్శించుకునేందుకు పోలీస్ శాఖతోపాటు ఇతర అధికారిక వీఐపీ ప్రోటోకాల్లో వచ్చిన అతిధులకు ఆలయ సంప్రదాయం ప్రకారం దర్శన భాగ్యం కల్పించడంలో సీఐ ప్రసాదరావు సేవలను ప్రశంసించారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు మెరుగైన పోలీస్ సేవలందిస్తూనే ఉంటామని ఆయన అన్నారు.