Travels Bus | ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్టు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో సుమారు 15 మంది మరణించినట్లు సమాచారం. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తున్నది. వారంతా చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లాకు చెందినది సమాచారం. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రయాణికుల హాహాకారాలతో ఘటనా స్థలం వద్ద హృదయవిదారక పరిస్థి నెలకొన్నది. ప్రమాదం నేపథ్యంలో చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
