తిరుమల : అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి (TTD Temple) స్థలం కేటాయింపునకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( CM Himanta Biswa Sharma ) హామీ ఇచ్చారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ( Chairnan BR Naidu ) తెలిపారు. శుక్రవారం ఈ మేరకు సీఎంను గౌహతిలో మర్యాదపూర్వకంగా కలిసి స్థలం కేటాయింపుపై చర్చించామని వివరించారు.
ఈ మేరకు స్పందించిన ముఖ్యమంత్రి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇస్తూ, రాష్ట్ర రాజధానిలో స్వామి వారి ఆలయం నిర్మించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించే ఆలయం ద్వారా హిందూ మత ధర్మ పరిరక్షణ, హిందూ సాంప్రదాయం , హిందూ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
స్వామి వారి ఆలయ నిర్మాణం ద్వారా ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని త్వరగా తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి తదితరులున్నారు.