అమరావతి : ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలల( Medical College ) పీపీపీ విధానంపై సిట్ విచారణ వేయిస్తామని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani ) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేసి పేదలకు వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఆరోపించారు. పీపీపీ ( PPP ) విధానంతో ఎవరూ కూడా బాగుపడలేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి , ప్రతి పక్షాల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండానే ఏకపక్షంగా నిర్లయాలు తీసుకోవడం విచారకరమన్నారు.
పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదని దుయ్యబట్టారు. ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయదలుచుకుంటే వైఎస్ జగన్ హయాంలో మంజూరైన కళాశాలలను వదిలేసి కొత్తగా ప్రైవేట్‌లో కళాశాలలను మంజూరు చేయించుకోవాలని సూచించారు. అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేస్తే ఇక సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.
ఆదోని మెడికల్ కళాశాలను కిమ్స్ తీసుకుంటుందని చంద్రబాబు చేసిన ప్రకటనను కిమ్స్ యాజమాన్యం ఖండించిందని అన్నారు. అమరావతిలో వచ్చిన ప్రతి టెండర్లో చంద్రబాబుకు నాలుగుశాతం కమీషన్ ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో మాస్ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.