అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేక్ ట్వీట్ల రచ్చ కొనసాగుతున్నది. వారం క్రితం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్లతో ట్వీట్లు వైరలయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ట్వీట్లు రావడం మొదలయ్యాయి. దేవినేని ఉమా రంగంలోకి దిగి సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేక్ ట్వీట్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌ను మంగళవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
తన పేరుతో వచ్చిన నకిలీ ట్వీట్లను ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రచారం చేస్తున్నారని, అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా పోలీసులను కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసినట్లుగా ఒక నకిలీ ట్వీట్ వైరల్ చేసినట్లు దేవినేని ఉమా తెలిపారు. వారం క్రితం వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై కూడా ఇలాంటి నకిలీ ట్వీట్లు పెట్టి వేధించారని గుర్తు చేశారు. చివరకు చంద్రబాబు సంతకం, లెటర్ హెడ్‌ను కూడా ఫోర్జరీ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబు ఫేక్ ట్వీట్‌ను సమర్థిస్తూ ట్వీట్ చేశారంటే అందులో కుట్రకోణం దాగిఉన్నదని అర్థమవుతున్నదని చెప్పారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఫేక్ ట్వీట్లను షేర్ చేస్తుండటానికి సీఎం జగన్ బాధ్యత వహించి ఏపీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.