తిరుమల లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ఫుల్స్టాప్ పెట్టాలనిసీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. భక్తుల మనోభావాలు కాపాడాలని కోరారు. రాజకీయ విమర్శలు మానుకొని.. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఫోకస్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సిట్ దర్యాప్తునకు ఆదేశించారని రామకృష్ణ అన్నారు. ఈ వివాదంపై అవసరమైతే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారని అన్నారు. ఈ వివాదంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబంధమేంటి అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం అయ్యింది దీక్షలు చేయడానికా అని ఆయన్ను ప్రశ్నించారు. భార్య క్రిస్టియన్ అని చెప్పిన పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లొచ్చా అని నిలదీశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని మరొకరిపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
అందరివాడైన వేంకటేశ్వరస్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదని రామకృష్ణ అన్నారు. తిరుమలకు జగన్ వెళ్తే అపవిత్రం అనే వ్యాఖ్యలు తగదని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా అని ప్రశ్నించారు. మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నాడని నిలదీశారు. వైఎస్ఆర్ ఐదేళ్ల పాటు సీఎంగా ఉండి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని అన్నారు. పట్టువస్త్రాలు ఇవ్వడమనేది ఒక ప్రాధాన్యత గల అంశమని.. అప్పుడు మాట్లాడకుండా.. నేడు సాధారణ భక్తుడిలా జగన్ తిరుమలకు వెళ్తానంటే డిక్లరేషన్ అడగడమేంటని నిలదీశారు.