అమరావతి : ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ (AP Metro Rail) ఎండీ గా రామకృష్ణారెడ్డి (Ramakrishna reddy) మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మూడేళ్లపాటు ఎంఆర్సీఎండీగా కొనసాగనున్నారు. రామకృష్ణా రెడ్డి గతంలోనూ ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ఎండీగా పనిచేస్తున్న జయమన్మథరావును (Jayamanmada Rao)ఆ పోస్టు నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు.
విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2014-19లో చంద్రబాబు నాయుడు మెట్రో రైలు ప్రతిపాదనను పట్టాలెక్కించారు. రెండుకారిడార్లలో మెట్రోరైలు నిర్మాణానికి ప్రతిపాదనలు, డీపీఆర్‌లు తయారు చేశారు. మొదటి కారిడార్ మహాత్మాగాంధీ రోడ్ ద్వారా వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వరకు, రెండవది బీఆర్టీఎస్ రోడ్, రైల్వేస్టేషన్ నుంచి రామవర్పాడు రింగ్ నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు నిర్మించాలని ప్రతిపాదించారు.