AP News | ఏపీలో పదో తరగతి అర్ధ సంవత్సరం పరీక్ష పేపర్లో యూట్యూబ్‌లో లీకవ్వడం కలకలం రేపింది. సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు సమాధానాలతో సహా ఆన్లైన్లో ప్రత్యక్షమవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 6-10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను రద్దు చేశారు. రద్దు చేసిన గణిత పరీక్షలను ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ మండిపడింది. ఇదేనా నీ40 ఏళ్ల అనుభవం అని చంద్రబాబుపై ధ్వజమెత్తింది. అర్ధ సంవత్సరం పరీక్షలే లీకేజీ లేకుండా నిర్వహించలేకపోతే.. రేపు పొద్దున పబ్లిక్ పరీక్షలు ఎలా నిర్వహిస్తావని ప్రశ్నించింది. అసమర్థుడైన నారా లోకేశ్‌కు విద్యా శాఖను అప్పగిస్తే ఇలాంటి లీకేజీలే దర్శనమిస్తుంటాయని విమర్శించింది.
సీల్డ్ కవర్లలో ఉంచాల్సిన పేపర్లను ఓపెన్‌గా అందించడంతోనే క్వశ్చన్ పేపర్ లీకైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఫార్మెటివ్, సమ్మెటివ్-1 అసెస్మెంట్ల పరీక్ష పేపర్లను మండల రిసోర్సు సెంటర్లలో నుంచి సీల్డు కవర్లలో భద్రపరుస్తారు. పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత పాఠశాలల పరీక్ష ఇన్చార్జి టీచర్ వెళ్లి ఉదయం, మధ్యాహ్నం జరిగే పేపర్లను ఎంఈవో నుంచి తీసుకొస్తారు. ఆయా పేపర్ల సీల్‌ను పాఠశాలలోని మిగతా టీచర్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. కానీ ఇంత పక్కాగా ఉండే భద్రతను చేధించి యూట్యూబ్‌లో పేపర్లు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. అర్ధ సంవత్సరం పేపర్లే లీకవ్వడంతో వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షల నిర్వహణ ఎలా ఉండబోతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా నీ40 ఏళ్ల అనుభవం అని చంద్రబాబుపైవైసీపీ ధ్వజమెత్తింది. అర్ధ సంవత్సరం పరీక్షలే లీకేజీ లేకుండా నిర్వహించలేకపోతే.. రేపు పొద్దున పబ్లిక్ పరీక్షలు ఎలా నిర్వహిస్తావని ప్రశ్నించింది. అసమర్థుడైన నారా లోకేశ్‌కు విద్యా శాఖను అప్పగిస్తే ఇలాంటి లీకేజీలే దర్శనమిస్తుంటాయని విమర్శించింది.
కాగా, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ లీకేజీ వ్యవహారంపై అధికారులు విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు పాఠశాలల్లో అంతర్గతంగా నిర్వహించే ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీని నియమించింది. ఇందులో నలుగురు అధికారులు ఉంటారని పేర్కొంది. కాగా ఇప్పటి వరకు ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్‌ల్లో నిల్వ చేసిన ప్రశ్నపత్రాలను ఇకపై పోలీస్ స్టేషన్లకు తరలించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడి నుంచే అయా పాఠశాలలకు ఉదయం వాటిని తీసుకువెళ్లాల్సి ఉంటుంది.