Ayyana Patrudu | అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. బయట మాట్లాడతానంటే తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం దర్శించుకున్నారు. శనివారం ఉదయం తిరుపతి జూపార్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. మేం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మొక్కలు నాటామని తెలిపారు. గత ప్రభుత్వం మొత్తం చెట్లన్నీ నరికేసిందని మండిపడ్డారు. పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటాలని సూచించారు. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించానని చెప్పారు. ఏపీలో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని తెలిపారు. రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల చేతిలో ఏపీ రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు. కూటమి పాలనతో తిరిగి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నామని అన్నారు. ప్రజలు మంచి తీర్పునిచ్చి పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారని తెలిపారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని పేర్కొన్నారు.