AP Liquor Scam | ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్టు చేయగా.. తాజాగా వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విచారించింది. పుత్తూరులోని ఆయన నివాసంలో సిట్ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు.
గత ప్రభుత్వంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో వైసీపీ హయాంలో మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్‌లో ఆన్లైన్ విధానం తీసేసి మాన్యువల్ తీసుకురావడంపైనా ప్రధానంగా విచారించినట్లు సమాచారం. డిజిటల్ చెల్లింపులు జరపకుండా మద్యం అమ్మకాల వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనే దానిపై కూడా సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ పాలసీలో నాడు తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఏంటనే దానిపైనా విచారణ జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.
ఏపీ బేవరేజ్ సంబంధించిన అధికారుల నియామకంలో తన పాత్ర ఏమీ లేదని నారాయణ స్వామి తెలిపినట్లు సమాచారం. తనకు లిక్కర్ కేసుకు సంబంధం లేదని చెప్పారట. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు.. అతన మాట అక్కడ ఏ అధికారి వినలేదని బదులిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు ఆరు గంటల పాటు విచారణ జరిపిన సిట్ అధికారులు.. మరోసారి విచారించే అవకాశం ఉంది.
సిట్ విచారణ అనంతరం కె.నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ” సిట్ అధికారులు నాలుగు ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చానని తెలిపారు. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని తెలిపానని అన్నారు. మరోసారి విచారణకు రావాలని అధికారులు నోటీసులిచ్చారని పేర్కొన్నారు..