AP IPS Suspension | ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించి వ్యాఖ్యలు చేశారని ప్రధాన కార్యదర్శి చెప్పారు. అందువల్లే సస్పెండ్ చేశామన్నారు. గతేడాది మార్చిలో ఏబీ వెంకటేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదైంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీగా పని చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాడు నిఘా పరికరాలను కొనుగోలు చేయడంలో అవినీతికి పాల్పడినట్లు ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం క్రిమినల్ కేసులు ఉన్నవారిని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని సీఎస్ వెల్లడించారు. ఇంతకుముందు సస్పెండ్ చేసినప్పుడు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లారు ఏబీ వెంకటేశ్వర రావు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే తిరిగి రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో చేరారు. ఏపీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం అదనపు డీజీగా నియమితులయ్యారు.