అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి జిల్లాల పునర్విభజన చేయనున్నారా?. కొత్తగా జిల్లాలను (New Districts) ఏర్పాటు చేయనున్నారా?. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు పేర్లను మార్వనున్నారా?.. ప్రస్తుతం ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతున్నది. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో 13గా జిల్లాల సంఖ్యను 26కు పెంచింది. అయితే అప్పుడే కొన్ని జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. ఇదే విషయమై టీడీపీ కూటమి హామీలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కొత్తగా మరో నాలుగు జిల్లాను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని 30 జిల్లాలుగా పునర్నిర్మాణం చేస్తారని సోషల్ మీడియాలో ఓ పోస్టు జోరుగా సర్కులేట్ అవుతున్నది. దాని ప్రకారం పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరరామ, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోని జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లాగా మార్చనున్నారని, ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇకపై కృష్ణా జిల్లా, వైఎస్సాఆర్ జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చనున్నారు. రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించనున్నట్లు అందులో ప్రస్తావించారు.
అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ‘ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాని, ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ, సమాజంలో అశాంతి రేపడానికి కొంత మంది అల్లరి మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్ను ఎవరూ నమ్మొద్దని కోరింది. ఈ జిల్లాల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాని, ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ, సమాజంలో అశాంతి రేపటానికి కొంత మంది అల్లరి మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం…#AndhraPradesh pic.twitter.com/ipdVxLVfZT
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 6, 2024