YS Jagan | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాల స్పందించాయి. ముఖ్యమంత్రి హోదాలో కేంద్రప్రభుత్వం తనకు కల్పించిన జడ్ ప్లస్ సెక్యూరిటీని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని జగన్ హైకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టాయి. భద్రతను తగ్గించారంటూ ఆయన చేస్తున్న వాదన నిజం కాదని స్పష్టం చేశాయి.
జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఆ హోదాలో అదనంగా కల్పించే భద్రతను మాత్రమే తగ్గించామని ఏపీ పోలీసు శాఖ తెలిపింది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ముఖ్యమంత్రికి కల్పించే భద్రత ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించామో.. ఇప్పుడు జగన్‌కూ అంతే భద్రత కొనసాగిస్తున్నామని వివరించింది.
ప్రస్తుతం జగన్‌కు 57 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని పోలీసు శాఖ తెలిపింది. జగన్ ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉందని.. షిఫ్టునకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్వోలు 24 గంటల పాటు నిరంతర భద్రత కల్పిస్తారని చెప్పింది. మొత్తం 24 మంది సిబ్బందితో రెండు ఎస్కార్ట్ బృందాలు ఎప్పుడు ఆయనతోనే ఉంటాయని తెలిపింది. పగలూ, రాత్రి కలిపి మొత్తం ఐదుగురు వాచర్లను ఏర్పాటు చేశామని పేర్కొంది. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని భద్రతా ఇన్ఛార్జిగా పెట్టామని తెలిపింది. మూడు షిఫ్టుల్లో పనిచేసేలా మొత్తం ఆరుగురు ఫ్రిష్కర్లు, స్క్రీనర్లు, నిరంతరం అందుబాటులో ఉండేలా ఆరుగురు డ్రైవర్లను జగన్‌కు కేటాయించామని వెల్లడించింది.