Kommineni Srinivasa Rao | ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కొమ్మినేనిని ఏపీకి తరలించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిసింది.
ఇవాళ ఉదయం ఏపీ పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావు నివాసానికి మఫ్టీలో వెళ్లారు. ఈ సందర్భంగా ముందస్తు నోటీసులు, సెర్చ్ వారెంట్ లేకుండా ఇంటికి వచ్చారని కొమ్మినేని ప్రశ్నించగా.. ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. కేసు ఏంటని అడిగితే మాత్రం పోలీసులు సమాధానమివ్వలేదు. అలాగే ఆయన్ను అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. ఈ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రెడ్‌బుక్ తన వరకూ వచ్చిందని తెలిపారు. నేను సీనియర్ జర్నలిస్టును.. ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టులకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదని.. ప్రభుత్వ వ్యతిరేక గొంతుక వినిపించకుండా చేసే యత్నం చేస్తున్నారని తెలిపారు. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 79, 196(1), 353(2), 299, 356(2), 31(1), బీఎన్ఎస్ 67, ఐటీఏ 3(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు
హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్న పోలీసులు https://t.co/FOeERtfWAB pic.twitter.com/bsr5WFCWde
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2025
అసలేం జరిగిందంటే..
ఓ టీవీ ఛానల్లో నిర్వహించిన చర్చ సందర్భంగా అమరావతి రాజధానిపై జర్నలిస్టు కృష్ణంరాజు అసభ్య వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేశ్యల రాధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో రాజధాని రైతులు, మహిళలు, ఏపీ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొమ్మినేనితో పాటు, జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే సాక్షి టీవీ ఖండించింది. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపింది. కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షి టీవీకి ఆపాదించడం సరికాదని తెలిపింది. మహిళల పట్ల తాము అత్యంత గౌరవాభిమానాలు చూపిస్తామని పేర్కొంది.