YS Sharmila | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందంలో మాజీ సీఎం వైఎస్ జగన్ భారీ స్కామ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ మంత్రి రోజా సెల్వమణి మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తోంది. అబద్ధాలను అందంగా అల్లడంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలని షర్మిల చేసిన కామెంట్లపై రోజా ఘాటుగా స్పందించారు. అసలు మీకు ఇంగ్లీష్ అర్థమవుతుందా అంటూ సెటైర్లు వేశారు. దీంతో రోజాకు షర్మిల ధీటుగా సమాధానమిచ్చారు. ఇంతకు ఇవి మీ రాతలేనా? లేక సాక్షి పంపిన స్క్రిప్టా? లేక సకల శాఖల మాజీ మంత్రి రాసిందా? అంటూ ప్రశ్నించారు.
తెర వెనుక దాక్కొని మిమ్మల్ని ముందుపెట్టి అబద్ధాలను అందంగా వర్ణించే వాళ్లను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నానని షర్మిల తెలిపారు. ఈ మేరకు పలు ప్రశ్నలను ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు.
1) దేశంలో సోలార్ విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గుతుంటే 25 ఏళ్ల కాంట్రాక్ట్ ఎందుకు చేశారు. ఐదేళ్ల తర్వాత రూ 1.50 పైసలకే యూనిట్ ధర వచ్చునేమో కదా..?
2) ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా ఏకపక్షంగా అదానీ వద్ద రూ.2.49 పైసలకు ఎందుకు కొన్నారు ? అదానీ మీద మీకు అంత ప్రేమ ఎందుకు ? 2020లో గుజరాత్లో సోలార్ యూనిట్ ధర కేవలం రూ 1.99 పైసలు మాత్రమే. మరి వెనకబడిన మన రాష్ట్రం అదానీ వద్ద 2021లో 50 పైసలు ఎక్కువ పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది ? ఇది రాష్ట్రం నెత్తిన అధిక భారం మోపినట్లు కాదా ?
3) అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ట్రాన్స్మిషన్ చార్జీలు లేవని, రూ 2.49 పైసలకే యూనిట్ ధర పడిందని చెప్పినా వీలింగ్ ఛార్జీలు, GST అన్ని కలిపి యూనిట్‌కి రూ. 4.16 పైసలు పడుతుందని విద్యుత్ రంగ అధికారులే చెప్తున్నారు..ఇది నిజం కాదా ?
4) 2021లో సెకీ, NTPC సంస్థలు 20 గిగావాట్ల సోలార్ విద్యుత్‌కి పిలిచిన టెండర్లలో రూ. 2.14 పైసలకే పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్న సంగతి మీకు తెలియదా ?
5) 2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టీపీ సౌర్యా అనే సోలార్ కంపెనీ రూ.2.14 పైసలకు, ఏఐ జోమయ్య అనే కంపెనీ రూ.2.15 పైసలు కోట్ చేసిన సంగతి మీరు గమనించలేదా ?
6) 2021లో రాజస్థాన్‌లో NTPC రెన్యువల్ ఎనర్జీ 1750 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం పిలిచిన టెండర్లలో యూనిట్ ధర రూ. 2.17 పైసలకు ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంగతి మీరు చూడలేదా ?
7) గుజరాత్లో రూ 1.99 పైసలు, రాజస్థాన్‌లో రూ 2.17 పైసలు, మధ్యప్రదేశ్‌లో రూ 2.14 పైసలు, మరి అదే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ. 2.49 పైసలు పెట్టి కొనడం తక్కువ ధరనా ? ఇదెక్కడి బంపర్ ఆఫర్ ?
8) చంద్రబాబు హయాంలో సోలార్ పవర్‌కి ఎక్కువ పెట్టి కొన్నారు అంటున్నారు. 2019లో మీరు అధికారంలో వచ్చాకా దానిపై ఎందుకు దర్యాప్తు జరిపించలేదు ? టెండర్లు రద్దు చేశారు సరే.. మరి దాని వెనుక మర్మం ఏంటో విచారణ చేయాలి కదా ? 5 ఏళ్లు అధికారంలో ఉండి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా?
అటు తిప్పి, ఇటు తిప్పి ఇంగ్లీష్‌లో చెప్పినా, తెలుగులో చెప్పినా నిజాన్ని మాత్రం దాచలేరని రోజాకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. అమెరికా దర్యాప్తు సంస్థల కళ్లు మూయలేరని అన్నారు. అదానీ దగ్గర మీరు రూ.1750 కోట్లు లంచాలు తీసుకున్నది వాస్తవమని అన్నారు. దేశంలో ఎవడు కొనని అదానీ సోలార్ పవర్‌ను ముడుపుల కోసం మీరు కొన్నది వాస్తవమని పేర్కొన్నారు.