AP News : రాష్ట్రంలోని పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి, ప్రతి ఎకరాకు నీరు అందించి తెలుగుతల్లికి జలహారతి పట్టడమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాగునీటి రంగంపై తాను చేస్తున్న కృషిని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రిక తనను ‘వాటర్ మ్యాన్’గా అభివర్ణించడం సంతోషంగా ఉందని అన్నారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘లీడర్షిప్ కాన్క్లేవ్’ లో చంద్రబాబు పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా సాగునీటి రంగంపై చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీతో యువతకు ఉపాధి కల్పించిన చంద్రబాబు.. ఇప్పుడు జల సంరక్షణతో ‘వాటర్ మ్యాన్’గా మారారని కొనియాడారు. పట్టిసీమ, హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సీఎం బాటలు వేస్తున్నారని ఎకనామిక్ టైమ్స్ కథనాన్ని ఆయన ఉటంకించారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తిచేసే లక్ష్యాన్ని కూడా ఆ పత్రిక ప్రశంసించిందని తెలిపారు.
ఈ ప్రశంసల నేపథ్యంలో పార్టీ నేతలంతా ఏకతాటిపై నిలబడి చంద్రబాబుకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి అభినందనలు తెలిపారు. పొలిటికల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు పూర్తి గౌరవం ఇస్తామని, అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవికి పదవి ఇవ్వడమే దీనికి నిదర్శనమని అన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేసే వారికే పార్టీలో, చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ బలోపేతం ఎంత ముఖ్యమో, కూటమి ఐక్యత కూడా అంతే ముఖ్యమని.. ఫ్లెక్సీలు, ఫోటోల కోసం వివాదాలకు తావివ్వకుండా కలిసికట్టుగా పనిచేయాలని, 2024 కంటే 2029లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టి, వ్యవస్థలను విధ్వంసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. పాలకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి గత పాలనే ఒక కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు.
వైసీపీ ఒక గొడ్డలి పార్టీ అని, ఉగ్రవాదుల తరహాలో హిట్-రన్-హైడ్ అనే విధానంతో రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి ఆరోపణను వాస్తవాలతో గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ విషయంలో వైసీపీ వక్రీకరణలకు పాల్పడుతోందని, వాటిని ఎండగట్టాలని సూచించారు.