AP News : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని, అవొ ఓర గొడ్డలి పార్టీ అని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గొడ్డలి, తప్పుడు ప్రచారమే ఆ పార్టీ అస్త్రాలని, వారి చరిత్ర మొత్తం రక్త చరిత్రేనని విమర్శించారు. తెలంగాణలో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన హంతకుడి మనస్తత్వానికి, జగన్ వైఖరికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఒక వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల విలువైన సహజ సంపద ఆవిరైందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు కేటాయించిన భూములను ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుందని, అయితే ఓబులాపురం మైనింగ్ అంశం ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. జగన్, ఆయన కుటుంబంవల్ల ఎందరో ఐఏఎస్ అధికారులు బలయ్యారని, ఎంతోమంది వ్యాపారవేత్తలు సర్వనాశనమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పుడు కూడా పెట్టుబడులు పెట్టేవారిని బెదిరించి పరిశ్రమలను తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నైజాన్ని చంద్రబాబు ‘హిట్, రన్ అండ్ ఎస్కేప్స గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక విధ్వంసం సృష్టించి, పక్క రాష్ట్రంలోని బెంగళూరులో తలదాచుకోవడం వారికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని, నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననాల కోసం, మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం కోసం వాడుకుంటున్నారని, ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి ఫేక్ పోస్టులను కట్టడి చేసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం రైతుల భూములను 22ఏ జాబితాలో పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, తమ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తోందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన ఓ దారుణ ఘటనను ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఓ వ్యక్తి.. తనపై పోక్సో కేసు పెట్టిందన్న కక్షతో బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని, తనకు సహకరించలేదని సొంత కుటుంబాన్ని కూడా కిరాతకంగా హత్య చేశాడని.. అతడి సైకో మనస్తత్వానికీ, సొంత బాబాయిని చంపి, కన్నతల్లిని, చెల్లిని దూరం పెట్టిన జగన్ మనస్తత్వానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల నేర ప్రవృత్తిని, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.