అమరావతి : అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence) అధికారులు పట్టుకుని వారి వద్ద నుంచి 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. అధికారులకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన 7.798 కిలోల విదేశీ బంగారాన్ని( Foreign Gold) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కారులో ఉన్న ఇద్దరుఅనుమానితులను పోలీసులు విచారించారు. వారు అందించిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో మరో డీఆర్ఐ బృందం తనిఖీలు చేపట్టి 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్‌ను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వారు వెల్లడించారు.