Current Bill | ఏపీలోని ఓ జిమ్‌కు ఏకంగా కోటి రూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. ఇది చూసి జిమ్ సెంటర్ నిర్వాహకుడు బిత్తరపోయాడు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కే నెలకు లక్షల్లో కరెంటు బిల్లు వస్తుంది.. అలాంటిది ఓ జిమ్ సెంటర్‌కు కోటికి పైగా కరెంటు బిల్లు రావడమేంటని బిత్తరపోయాడు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కాండ్రేగుల జగన్నాథం అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పూడిమడక రోడ్డులో జిమ్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రతి నెల ఆయనకు రూ.18 నుంచి 20 వేల వరకు కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఈసారి కరెంటు బిల్లు మాత్రం ఆయన్ను బిత్తరపోయేలా చేసింది. ఇందుకు కారణం ఆ కరెంటు బిల్లు ఏకంగా ఒక కోటి 15 వేల రూపాయలు వచ్చింది. అంత బిల్లు ఎలా వచ్చిందో అర్థం కాని జగన్నాథం.. వెంటనే అధికారుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు.
జరిగిన పొరపాటును సరిదిద్దాల్సిన అధికారులు భిన్నంగా వ్యవహరించాడు. బిల్లు సంగతి చూస్తాంలే కానీ.. కరెంటు బిల్లు పెరిగి వచ్చిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని గట్టిగా చెప్పారు. ముందు బిల్లు సరిచేయాలని అడిగితే రివర్స్‌లో బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అయితే తనకు ఎప్పుడూ రూ.18వేల వరకు మాత్రమే బిల్లు వస్తుందని.. సమ్మర్లో మాత్రం 20 వేల వరకు కరెంటు బిల్లు వస్తుందని బాధితుడు చెప్పాడు. కానీ ఇంతలా బిల్లు వేయడమేంటని వాపోతున్నాడు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలా కరెంటు బిల్లులు భారీగా రావడం కొత్తేమీ కాదు. ఇటీవల పాడేరు నియోజకవర్గంలో ఓ మహిళకు 70 వేల కరెంటు బిల్లు వచ్చింది. ముందు నెలలో కరెంటు బిల్లు మైనస్‌లో వేశారు. ఆ తర్వాత నెల మాత్రం రీడింగ్ ఎక్కువగా చూపించి, రూ.70 వేల వరకు బిల్లు వేశారని ఆరోపించింది.