AP News : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొల్లు రవీంద్ర తెలిపారు. గడిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని, కుట్రలు, కుతంత్రాలు చేయడం తప్ప జగన్కు రాష్ట్ర అభివృద్ధి అస్సలు పట్టదని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలందరికీ వివరించబోతున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.