AP News : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. రాబోయే మూడు గంటల్లో ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తీవ్ర హెచ్చరిక చేసింది. ఈ మేరకు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తన ప్రకటనలో పేర్కొన్నది.
వర్ష తీవ్రత, పిడుగుపాటు ప్రమాదం అధికంగా ఉండటంతో ఇంతకుముందు జారీచేసిన ఆరెంజ్ అలర్ట్‌ను తాజాగా రెడ్ అలర్ట్‌గా సవరించినట్లు వెల్లడించింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పుల దృష్ట్యా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద, శిథిల భవనాల్లో ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.