AP News | ఏపీకి దీపావళి ముందే వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనకు జనం స్వస్తి పలికారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్యకుమార్ అనంతపురం జిల్లాకు వచ్చారు. మంత్రి సత్యకుమార్‌కు కూటమి నేతలు ఆయనకు ఘన స్వాగం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం ఏపీలో ఏర్పడిందని అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం తిరోగమనంలో పయనించిందని.. 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందని సత్యకుమార్ అన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఏపీకి అస్తిత్వం లేకుండా చేశారని విమర్శించారు. ఆరోగ్యశ్రీలోనూ భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తమ వర్గీయులకు సంబంధించిన ఆస్పత్రులకు నిధులను దోచి పెట్టారని అన్నారు. 15వ ఆర్థిక సంఘం, కేంద్రం నుంచి వచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని పేర్కొన్నారు. దీనిపై కచ్చితంగా విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవర్నీ వదిలిపెట్టమని హెచ్చరించారు. చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ చంద్రబాబు గాడిలో పెడతారని వ్యాఖ్యానించారు. తమపై చాలా పెద్ద బాధ్యతలను ప్రజలు ఉంచారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఏపీని అగ్రగామిలో ఉంచుతామని తెలిపారు.