Nara Lokesh | ఏపీలో ఇప్పటికే రుషికొండ ప్యాలెస్ వివాదం సంచలనం సృష్టిస్తుంటే.. ఊరూరా వైసీపీ ప్యాలెస్లు నిర్మిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ.. ఇలా ఊరూరా రాజభవనాలను తలదన్నేలా సొంత ప్యాలెస్లను కట్టుకున్న జగన్.. ఇప్పుడు ఏకంగా వైసీపీ ఆఫీసుల కోసం కూడా ప్యాలెస్లు కట్టిస్తున్నాడని పేర్కొంది. అది కూడా అనుమతి లేకుండా ప్రజాధనంతోనే నిర్మిస్తున్నారని ఆరోపించింది.
ఏపీలోని 26 జిల్లాల్లో 42.24 ఎకరాల ప్రభుత్వ భూమిని తన పార్టీ ఆఫీసుల కోసం వైఎస్ జగన్ కేటాయించారని టీడీపీ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పేర్కొంది. రూ.688 కోట్ల విలువైన ఈ భూమిని కేవలం ఎకరానికి రూ.వెయ్యి నామమాత్రపు ధరకే లీజుకు తీసుకున్నాడని విమర్శించింది. ఈ స్థలంలో రూ.500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని తెలిపింది. ఈ 26 భవనాల్లో ఒక్క ప్రకాశం తప్ప.. ఏ భవనానికి కూడా అనుమతులు లేవని చెప్పింది.
కాగా, 26 జిల్లాల్లో వైసీపీ భవనాల నిర్మాణంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజిరెడ్డి జాగీరా అని వైఎస్ జగన్ను ప్రశ్నించారు. ‘ వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావ్.’ అని మండిపడ్డారు. జగన్ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చని అన్నారు. ఆయన విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చని తెలిపారు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా? అని మండిపడ్డారు.
ఇవి జగన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటున్నారా ? కాదు, ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్లు.
తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు యలహంకా ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, ఇలా తొమ్మిది నగరాల్లో తన సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్న జగన్… pic.twitter.com/daL1lGz2uj
— Telugu Desam Party (@JaiTDP) June 23, 2024