Nara Lokesh | డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తగానే పనిచేస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఏ పదవి ఇచ్చినా కూడా బాధ్యతతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ఓ వార్తాపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో నారా లోకేశ్ సోమవారం నాడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా పడింది. దీంతో కోర్టు నుంచి బయటకొచ్చిన అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
తెలుగు దేశం పార్టీలో ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు సార్లకు మించి ఉండకూడదని నారా లోకేశ్ అన్నారు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని.. ఈసారి ఆ పదవిలో ఉండకూడదని అనుకుంటున్నానని వెల్లడించారు. దీనిపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తానని చెప్పారు.
తల్లి, చెల్లినే నమ్మని జగన్.. ఎవరినీ నమ్మరని నారా లోకేశ్ అన్నారు. డబ్బు కోసం ఆయన పార్టీనే అమ్మేసే రకమని తెలిపారు. అందుకే జగన్‌పై నాయకులకు నమ్మకం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని, కార్యకర్తలను విజయసాయి రెడ్డి ఇబ్బంది పెట్టారని ఆయన గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి టీడీపీలోకి వస్తానంటే ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించారు.
విశాఖలో విజయసాయి రెడ్డి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందని నారా లోకేశ్ తెలిపారు. రెడ్‌బుక్ గురించి తాను చెప్పిన విషయం చాలా స్పష్టంగా ఉందని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అవినీతి కేసులపై వెంటనే విచారణ జరపడం కుదరదని.. ఒక్కొక్కటిగా అన్నీ చేస్తామని.. వేచి చూడాలని అన్నారు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.