Nara Lokesh | తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. జగన్ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమపై వేసిన నిందలకు కట్టుబడి ఉంటే తిరుమలకు వచ్చి ప్రమాణం చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాలు విసిరారు. దీనికి ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా అంతే దీటుగా ప్రతి సవాలు విసిరారు. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో శుక్రవారం నిర్వహించిన ‘ఉత్తమ కార్యకర్త-మన టీడీపీ యువ ఛాంపియన్స్’ సమావేశంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని నారా లోకేశ్ అన్నారు. లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ చేశారని నివేదికలు వచ్చాయని చెప్పారు.
దేవుడి దగ్గర కూడా వైసీపీ నాయకులు రాజకీయాలు చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. టీటీడీని ప్రజా ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలనని అన్నారు. క్యాన్సర్ గడ్డలా మారిన పాపాల పెద్దరెడ్డిని వదలమని స్పష్టం చేశారు.