AP News | ఏపీ ఆర్థికంగా చితికిపోయిందని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా కూడా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా విజయనగరం వెళ్లిన ఆయన.. మొదట పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయకత్వంలో మంత్రిగా సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తీసుకొస్తామని పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మహిళా పొదుపు సంఘాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.