Rushikonda Palace |రుషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె.. రుషికొండ భవనాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు. రుషికొండ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలోని వీఎమ్ఆర్డీఏలో మంత్రి కందుల దుర్గేశ్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పర్యాటక రంగంలోని సమస్యలను అధ్యయం చేయడం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. పర్యావరణ హితమైన టూరిజాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో సినిమా రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. అత్యధిక సినిమా షూటింగ్‌లు విశాఖలో జరుగుతున్నాయని అన్నారు. ఇక్కడ సినిమా రంగం అభివృద్ధికి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ బృందం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలవనున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీలో సినీ రంగం అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టినట్లు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే విశాఖలో పర్యటిస్తారని పేర్కొన్నారు.