YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడ్డారు. తల్లి, చెల్లిపై కోర్టుకు వెళ్లిన వ్యక్తి కూడా మహిళల గురించి మాట్లాడతారా అని నిలదీశారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం పథకాల ద్వారా మహిళలంతా పండుగ చేసుకుంటుంటే జగన్ మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారని మండిపడ్డారు.
అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. భరతమాత అంటే కూడా జగన్కు గౌరవం లేదని అన్నారు. సీఎంగా పనచేసి కూడా కనీసం ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేయలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం సూపర్ హిట్ అయ్యిందని తెలిపారు. ఈ విజయం చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. స్త్ర వక్తి, తల్లికి వందనం వంటి పథకాలతో మహిళలు ఆనందంగా ఉన్నారని.. ఇది చూసి జగన్కు అసహనం కలుగుతుందని విమర్వించారు. బాలికల నుంచి వృద్ధుల వరకూ ఏ మహిళకు స్త్రీ శక్తి అందడం లేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద అక్కసు ఇలాగే కొనసాగితే ఉన్న 11 కూడా ఈసారి మిగలవని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి రోజాపైనా మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. మహిళల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని అన్నారు. చంద్రబాబును విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. జబర్దస్త్ వ్యవహరశైలిని ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించారు.