విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గురువారం రాత్రి తొలగించడం సంచలనంగా మారింది. ఈ దాడిని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఉండకూడదనే టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశం ఉందన్నారు. వెంటనే దాడి ఘటనపై విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు, నారా లోకేశ్ ప్రమేయంతోనే అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ దాడి దురదృష్టకరమని.. అంబేడ్కర్ విగ్రహంపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. దాడి ఘటనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది అంబేడ్కర్ విగ్రహంపై దాడి కాదని.. ప్రజాస్వామ్యంపై దాడి అని పోతిన మహేశ్ విమర్శించారు. ఈ దాడిలో టీడీపీ నేతల హస్తం ఉందని అన్నారు. అధికారుల అండదండలతో దాడి చేశారని, వెంటనే ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, ఈ ఘటనపై వైసీపీ రాద్ధాంతం చేస్తుందని మంత్రి డోలా బాలావీరాంజనేయ స్వామి విమర్శించారు. జగన్ పేరు తొలగింపు ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆగంతకులు చేసిన పనిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ పేరు తొలగించినప్పుడు వైసీపీ దళిత నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అంబేడ్కర్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని విమర్శించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.