జగన్ తన ప్రచార పిచ్చితో సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై తన బొమ్మను ముద్రించారని నిన్న జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. సమాధి రాళ్లపై ఫొటోలు వేసుకున్నట్లుగా రైతుల పొలాల్లోని సర్వే రాళ్లపై ఫొటోలు వేయించుకున్నాడని జగన్పై మండిపడ్డారు.
రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టుకోవడానికి ఒప్పుకుంటాడు కానీ.. పొలం హక్కు పుస్తకాలపై దిష్టిబొమ్మ పెడితే ఊరుకోరని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము రూ.650 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసి పబ్లిసిటీ స్టంట్లు చేసినందుకే నిన్ను ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు. అందుకే రాజముద్రతోనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఇకపై కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని తెలిపారు.
రైతు భూమినే నమ్ముకుని జీవిస్తాడని.. రైతు దేశానికి అన్నం పెడతాడు.. అటువంటి రైతుల భూముల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు ఏంటి అని కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆస్తులపై జగన్ బొమ్మలు ఇక ఉండవని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతోనే పాస్ పుస్తకాలు ఉంటాయని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజా ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ తన ప్రచార పిచ్చితో రూ.700 కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ కార్యాకలాపాలపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే రాళ్లు, పాసు పుస్తకాలు తదితర అంశాలపై కీలక చర్చ సందర్భంగా జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన ప్రచార పిచ్చితో తన బొమ్మ వేసుకోవడానికి రూ.15 కోట్లు ఖర్చు పెట్టారని.. రీసర్వే పేరుతో రాళ్ల కోసం రూ.687 కోట్లు తగిలేశారన్నారు. మిగిలి ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలో ఆలోచించాలని.. వాటిపై పేర్లను చెరిపివేయాలంటే అదనంగా మరింత ఖర్చవుతుందని పేర్కొన్నారు.