Vangalapudi Anitha | ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరావతి ముంపునకు గురైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై రాజద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే చర్యలు ఉంటాయని వంగలపూడి అనిత తెలిపారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. కొంతమంది రిటైర్డ్ అధికారులు కూడా ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు వెనుకాడే పరిస్థితి లేదని తెలిపారు. నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌కు పెరోలు ఇచ్చిన వారంలోపే రద్దు చేసి జైలుకు పంపించామని వంగలపూడి అనిత తెలిపారు. పెరోలు ఎవరు ఇచ్చారనే దానిపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ కొందరిని పెంచి పోషించారని తెలిపారు. గతంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా మీ ఆటలు సాగుతాయని అనుకోవద్దని పేర్కొన్నారు. ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు.. కూటమి ప్రభుత్వమని తెలుసుకోవాలన్నారు. అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసని చెప్పారు. ఎన్డీయే కూటమి తప్పు చేసిన వారిని వదిలిపెట్టదని స్పష్టం చేశారు.