Vangalapudi Anitha | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఆమె ఘాటుగా స్పందించారు. బాబాయ్‌ను చంపిన వారికి ఎన్నికల్లో ఓటు వేయాలా? తల్లికి, చెల్లికి ఆస్తి పంచకుండా కోర్టుకు వెళ్లిన వ్యక్తికి ఓటు వేయాలా అని ప్రశ్నించారు.
పులివెందులలో ఎన్నికలను ఎప్పుడూ కూడా భయపెట్టి, ఏకపక్షంగా జరిపే చరిత్ర ఉందని వంగలపూడి అనిత అన్నారు. కూటమి నాయకులు పోలింగ్ బూత్‌లను కావాలనే దూరంగా మార్చారని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. పోలింగ్ బూత్‌ల మార్పు నిర్ణయం ఎన్నికల కమిషన్‌దే తప్ప ముఖ్యమంత్రిది కాదని స్పష్టం చేశారు. ఏ పార్టీలూ ఈ విషయంలో చేయలేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకే పులివెందులలో పోలింగ్ స్టేషన్ల మార్పు జరిగిందని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు గడువు కూడా పెట్టిందని పేర్కొన్నారు. గడువులోగా ఎవరూ అభ్యంతరాలు చెప్పకపోవడం వల్లనే ఎన్నికల కమిషన్ పోలింగ్ స్టేషన్లను మార్చిందని స్పష్టం చేశారు.
పులివెందుల ఎన్నికల విషయంలో జగన్‌కు భయం పట్టుకుందని వంగలపూడి అనిత ఆరోపించారు. గతంలో జగన్‌కు ఉన్న అనుభవాల వల్లే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వంగలపూడి అనిత విమర్శించారు. వైసీపీ డీఎన్ఏలోనే దాడులు, దౌర్జన్యం ఉంటాయని అన్నారు. నామినేషన్ చింపేసే రాజకీయాలు గతంలో చాలాసార్లు చూశామని.. ఇప్పుడు జగన్ చేస్తున్న విమర్శలు కేవలం తమపై నింద మోపడానికి మాత్రమేనని వ్యాఖ్యానించారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని.. అనుమానాస్పద ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.