Vangalapudi Anitha | ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీశ్ వసూళ్ల పర్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత పదేళ్లుగా అనిత దగ్గర పీఏగా పనిచేస్తున్న జగదీశ్.. ఆమె అండతోనే అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని కొద్దిరోజులుగా ఆరోపణలు ఉన్నాయి. పేకాట శిబిరాలు నిర్వహించడంతో పాటు ఉద్యోగుల బదిలీల విషయంలో లక్షల డబ్బు వసూలు చేశారనే విమర్శలు వస్తున్నాయి.
పేకాట శిబిరాల నిర్వహణతో పాటు మద్యం దుకాణాల్లో వాటాలు, ఆఖరికి టీడీపీ సిఫార్సు లేఖలు అమ్ముకోవడం ఇలా లెక్కకు మించి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించారని తెలుస్తోంది. ఇలా అనిత పీఏ జగదీశ్ చేస్తున్న అవినీతి దందాపై కొద్దిరోజులుగా విమర్శలు వస్తున్నాయి. అనిత అండతోనే జగదీశ్ ఇదంతా చేస్తున్నాడని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జగదీశ్ అవినీతిలో మీ వాటా ఎంత అని ప్రశ్నిస్తున్నారు.
పీఏ జగదీశ్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలతో హోంమంత్రి వంగలపూడి అనిత చర్యలకు దిగారు. తన ప్రైవేటు పీఏ జగదీశ్‌ను విధుల్లో నుంచి తొలగించారు. ఈ విషయాన్ని శనివారం పాయకరావుపేటలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు.